0
రాష్ట్ర విభజనలో దారుణంగా అన్యాయానికి గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోలుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం ఎన్నోరకాలుగా సహకరించాల్సి వుంది. విభజన బిల్లులో వున్న అంశాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు విభజన బిల్లు ఆమోదం సమయంలో హామీ ఇచ్చిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సి వుంది. ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, పారిశ్రామికంగా కొంతయినా పుంజుకునే అవకాశం వుంది. అయితే ఈమధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్న దుష్ప్రచారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తే మాకూ ఇవ్వాలన్న వెటకారం డిమాండ్లు కూడా వినిపించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదేమోనన్న భయం రాష్ట్ర ప్రజల్లో కలిగింది. అయితే అవన్నీ అనవసరపు భయాలేనన్న క్లారిటీ వస్తోంది. రెండు వారాల్లోనే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అవకాశం వుందని ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం సమయంలో భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పట్టుబట్టింది. దానికి సంబంధించి లోక్‌సభ సాక్షిగా అప్పటి యుపిఎ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీని పొందింది. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడానికి బీజేపీ కృతనిశ్చయంతో వున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఈ అంశం మీద ఆంధ్రప్రదేశ్ అధికారులతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావుతో సమావేశం నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన కొన్ని ఫైళ్ళు కేంద్ర ఆర్థిక, పారిశ్రామిక అధికారుల వద్దే వున్నాయని, అవి తిరిగి తన వద్దకు రాగానే ప్రత్యేక హోదా ప్రక్రియను ముమ్మరం చేస్తానని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి వుంటుందని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం.

మొత్తమ్మీద పదిహేను రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ప్రకటించే అవకాశం వుందని ఆంధ్రప్రదేశ్ అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ పదిహేను రోజుల్లో ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కి అదనపు ప్రయోజనం కూడా చేకూరే అవకాశం వుందంటున్నారు. ఈనెల 24 నుంచి 28వ తేదీ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్‌లో పర్యటించనున్నారు. ఆయన జపాన్ పర్యటనకు వెళ్ళే ముందే ఏపీకి ప్రత్యేక హోదాను ప్రకటించడం వల్ల చంద్రబాబు జపాన్ నుంచి భారీ పెట్టుబడులను తెచ్చే అవకాశాలు మరింత మెరుగుపడతాయని భావిస్తున్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు జపాన్ పర్యటనకు ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించే అవకాశం వుందని అనుకుంటున్నారు. 

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top